అద్దంకి నియోజకవర్గంలో దూరభారంతో పేద బాల, బాలికలు చదువు మానివేయకుండా ఉండాలన్న సదుద్దేశంతో దశలవారీగా 10 వేల సైకిళ్లు ఉచితంగా అందిస్తానని ఇచ్చిన హామీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో సంతమాగులూరు మండలం, కొమ్మాలపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులకు, మక్కెనవారిపాలెం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ లో 349 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువకుంటున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు సైకిళ్ళు పంపిణీ చేయటం తనకెంతో సంతోషం కలిగిస్తుందని ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యతోనే వికాసం సాధ్యమవుతుందన్న డా.బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే బాటలో బాల, బాలికల బంగారు భవిష్యత్తుకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని గొట్టిపాటి హామీ ఇచ్చారు.






