ఒంగోలులో ఇటీవల సంచలనం కలిగించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ బాబుకు ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సురేష్ బాబు దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ పై జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి డబ్బులు చేతులు మారటం, ఫోన్ కాల్స్ తదితర ఆధారాలు ఉన్నందున ప్రధాన నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ బాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతుండగా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందనీ, దానిని ప్రాతిపదికగా తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని సురేష్ బాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ బెయిల్ పై కింది కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.





