అగ్రిగోల్డ్ ఫార్మ్స్ కంపెనీ భూములకు సంబంధించిన సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ లో అగ్రిగోల్డ్ సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు ప్రత్యేక న్యాయస్థానం వారి ఉత్తర్వుల మేరకు అగ్రి గోల్డ్ కంపెనీ ఆస్తులను వేలం వేసి తదుపరి చర్యలు తీసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని గన్నవరం మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను తెలియజేయాలని గుడివాడ ఆర్డీవోను కోరగాఅందుకు గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం జిల్లా ఇన్చార్జి కలెక్టర్కు వివరిస్తూ గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అగ్రిగోల్డ్ కు సంబంధించిన 23.92 ఎకరాల భూమి, భవనాలు, కర్మాగారాలు, యంత్ర సామాగ్రి ఉన్నాయన్నారు. ఆ ఆస్తులను తాను డిఎస్పి తో కలిసి భౌతికంగా పరిశీలించామన్నారు.
దీనిపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్పందిస్తూ అందుకు సంబంధించిన సమగ్ర తనిఖీ నివేదిక వెంటనే అందజేయాలన్నారు. ఆ నివేదికతో పాటు గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి ఆ ఆస్తులకు సంబంధించిన విలువ వివరాలను, అధికృత సంస్థ నుండి ఆ ఆస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్ విలువను కూడా సేకరించి ఇవ్వాలన్నారు. ఆ భూములను ముటేషన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఈ విషయమై గుడివాడ ఆర్డిఓ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లలో తనఖా పెట్టీ 90 కోట్ల రూపాయలు రుణాలు పొంది తిరిగి చెల్లించనందున బ్యాంకులవారు ఆ ఆస్తులను నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్ పి ఏ) గా ప్రకటిస్తూ ఏలూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసినందున ముటేషన్ చేయుటకు వీలు లేకుండా పోయిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్కు వివరించారు.




